కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

11, ఏప్రిల్ 2015, శనివారం

తెల్ల మేడ మీద కాకి వాలితేనే మేడ తెలుపు తెలుస్తుంది.

తెల్ల మేడ మీద కాకి వాలితేనే మేడ తెలుపు తెలుస్తుంది.

 రెండు వేల అయిదు వందల సంవత్సరాల పైబడిన  జైన,బౌధ్ధ హిందూ మత చరిత్ర ఉన్న విజయనగరం జిల్లాలోని రామతీర్థం, గురుభక్త కొండల(విశాలమైన తెల్లమేడలాంటి)  గురించి చరిత్ర తవ్వి తీస్తే  చాలాకాలం పాటుదశ దిశలా విరాజిల్లిన కళింగ సీమ ఖ్యాతి ఈనాడు ఈ ప్రభుత్వం ప్రభుత్వ అధికారిక లాంఛనాల విషయం లో పక్కన పెట్టడం వల్ల మాయమైపోదు.తెల్లమేడ మీద నల్లకాకి వాలినట్టే అవుతుంది.



రాజరాజనరేంద్రుడి తండ్రి విమలాదిత్యుడి కాలంలో అతని గురువు విజయనగరం జిల్లాలోని రామతీర్థం ( ఆ కాలంలో రామతీర్థం ఒక గొప్ప జైన పుణ్యక్షేత్రం.) వచ్చినట్టు రామతీర్థం లో ఉన్న కన్నడ శాసనం చెపుతుంది..ఆశాసనం చెపుతున్నదాన్ని బట్టి విమలాదిత్యుడు జైన మతాన్నవలంబిచేడనీ,జైన మతంలోని దేశి గణ శాఖకి చెందిన త్రికాళయోగ శిధ్ధాంతి ని గురువు గా స్వీకరించేడని ఆ గురువు రామతీర్థం వచ్చేడనీ రామతిర్థం కొండమీదున్న గుహలొ ఈ శాసనం చెక్కబడి ఉంది.తూర్పు చాళుక్యరాజుల పాలనలో ఉన్న ఆ నాటి కళింగ దేశంలో కూడా కన్నడ దేశం లాగానే జైనమతం బలంగా ఉండేదని తెలుస్తుంది రామ తీర్థం లో దొరికిన జైన ప్రతిమలని బట్టి,పాండవ పంచ గుహలో పూర్వ చాళుక్య లిపితో చెక్కబడిన జైన నామాలని బట్టి క్రీ.శ. 5 ,6 శతాబ్దాలలో నే కాదు అంతకు ముందు నుండీ కళింగ దేశం లో జైన మతవ్యాప్తి ఎక్కువగానే ఉండేదని తెలుస్తుంది. 

ఖారవేలుడి హాథీ గుంఫ శాసనాన్ని పరిశీలిస్తే,నంద వంశం రాజులు మగధనేలినప్పటినుంచీ అంటే క్రీ.పూ.5వ శతాబ్దం నుండీ వాళ్ళ పాలనలోనే ఉన్న కళింగం లో కూడా జైన మతావలంబనం చాలా ఎక్కువగానే ఉండేది.అంటే ఆ కాలంనుండీ రామగిరి ( రామ తీర్థం) కొండలమీద జైనమత గోళకీ మఠం తో పాటు  జైనులఆవాసాలకి కూడా నిర్మాణాలు ఎక్కువగానే ఉండేవి.జైనమతం తర్వాత కళింగ ప్రాంతం అంతటా బౌధ్ధమతం విస్తరించింది.ఆ సంగతికి రామ తీర్థం లోని గురుభక్త కొండ మీద నిలువెత్తు సాక్ష్యాధారాలు కనిపిస్తాయి..ఈ కొండ మీద పెద్ద పాడుపడిన బౌధ్ధ మఠం ఒకటి ఉంది.
ఈ ప్రాంతానికి రామతీర్థం అనే పేరు రావడానికి కారణం శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంతకాలం నివశించేడనీ,ప్రస్తుతం ఇక్కడున్న రామాలయానికి దగ్గర రామ సరోవరాన్ని అతడే నిర్మించేడనీ స్థల పురాణం చెపుతుంది.ఇది అర్థం చేసుకుంటే ఇక్కడి రామాలయ నిర్మాణం వనుక వేల సంవత్సరాల కాలం దాగి వుందనీ, ఇంక ఏ సీమ లోని రామాలయాలు ఇంతకన్న పురాతనమైవి కనబడవనీ తెలుస్తుంది. ఇది చెప్పే వారెవరు..? వినేవారెక్కడున్నారు?
ఈ కొండమీదున్న బౌధ్ధ మఠానికి  పడమరగా ఒక పెద్ద స్థూపం ఉంది.దానికి తూర్పుగా ఒక చైత్యాలయం ఉంది.ఇది 40 అడుగుల పొడవు 11 అడుగుల వడల్పు 6 అడుగుల ఎత్తు కలిగి ఉంది.దీనిలో ఉన్న గర్భాలయం గోబా అని బౌధ్ధులు పిలిచేది 7 అడుగుల ఎత్తు న ఉంది.దీన్లోనే బుధ్ధుడి స్మారక చిహ్నాలు ఉన్న భరిణ ఉండేది.. ఈ చైత్యాలయం నిర్మాణంలో పూజా ద్రవ్యాలు భద్రపరిచేందుకు గోబా,పూజలు చేయడానికి చైత్యాలయం,బౌధ్ధ సన్యాశులు  నివశించేందుకు బౌధ్ధ మఠం ఉపయుక్తమయ్యేవి.మద్రాసు వస్తు ప్రదర్శన శాలలో ఉంచిన భట్టిప్రోలు బౌధ్ధ స్థూపం లోని భరణ లాగానే ఇక్కడి భరిణ కూడా మంచి రాతి మూత కలిగి ఉంది.దీనిలో కూడా బుధ్ధుడి పన్ను,ఎముక ముక్కలు,నవరత్నాలు,నాణేలు ఉండేవి.ఈ చైత్యాలయం సమీపం లోనే బౌధ్ధ విహారం, కొన్ని నేలమాళిగలు ఉన్నవి.

ఈగురుభక్తకొండమీదమొత్తానికి5,6చైత్యాలయాలు,2విహారములు30మాళిగలు,అనేకడగోబాలు ,బుధ్ధవిగ్రహాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ కొండ గుహలలో అనేక జైన విగ్రహాలు కూడా దొరికేయి. అంటే ముందు ఈ కొండలు జైన మతస్థుల చే ఆక్రమింపబడి తర్వాత బౌధ్ధ మతస్థుల చేతిలోకి వెళ్ళేయనీ,అది కూడా క్రీ.పూ.3 వ శతాబ్ది కాలంలో అయి వుండవచ్చనీ పురాతన శాస్త్రవేత్తల అభిప్రాయం.

ఇంకాఇక్కడఆయాకాలాలకిచెందినచిత్రలేఖనాలతోకూడినకుండలు,బొమ్మలు,పాత్రలు,ముద్రలు,పూసలు,ఇనుప కత్తులు,సీసపు నాణేలు,బౌధ్ధ జైన విగ్రహాలు చాలానే దొరికేయి.సీసపు నాణేలు ఆంధ్రులవి అని శాస్త్రవేత్తల భావన.ఇందులో ఒక నాణెం మీద ఒక పక్క చైత్యం,మరొకపక్క'సిరిశివమక విజయరజ శెలసగన"( అంటే అమరావతి శాసనం లో కనిపించే 'శ్రీ శివమాక శాతకర్ణుని శైల సంఘము') అన్న పేరు కనిపిస్తాయి.ఈ శైల సంఘం రామతీర్థం కొండమీద ఉండినటువంటి బౌధ్ధ సన్యాశ సంఘం. ఈ గురుభక్త కొండకి పమటి దిశలో దుర్గ కొండ ఉంది.దానికి ఆ పేరు రావడానికి కారణం దాని మీద దుర్గాలయం ఉండటమే.అది కాదు విశేషం.అక్కకూడా బౌధ్ధ జైన హిందూమత చిహ్నాలు దొరకటమే.ఇంకా చెప్పాలంటే ఇక్కడకూడా ఒక చైత్యం, అనేకగుహాలయాలు,జైన విగ్రహాలు,మట్టి ముద్రలు,పాత్రలు,రాగి నాణేలు,ఇనుప కత్తులు దొరకటం.

 ఈ చారిత్రక విశేషాలని వీక్షకులకి చెప్పడంలో ఉన్న ఆశ ఒక్కటే.."Vision without Action is merely a dream.Action without vision  just passes the time.Vision with action can change the world." అని  Joel Arthur Barker చెప్పిన అంశమే.