కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

15, నవంబర్ 2014, శనివారం

ఆత్మలను మరింత వెలుగులతో నింపడానికే చరిత్ర చదవాలి !


“History is not a burden on the memory but illumination of the soul ““అని ఆంగ్ల చరిత్రకారుడు Lord Action (1834-1902) వ్యాఖ్యానించేడు .( చరిత్ర తెలుసుకోవడమంటే జ్నాపకాల కి బరువు పెంచు కోవడం కోసం కానేకాదు.అది తెలుసుకున్న ప్రతీ వాళ్ళ లో నూ వారి ఆత్మను మరిన్ని వెలుగులతో నింపేది మాత్రమే అవుతుంది.)

ఐతే చరిత్ర పట్ల ఆసక్తి ఏజాతి ప్రజల్లోనూ ఈదేశం లో ఏనాడూ లేకపోవటం వల్ల ప్రాచీనభారత దేశం లోని పదహారు మహాజనపధాల చరిత్ర అరకొరగానే ఉండిపోయింది.ఆంగ్లేయులు భారతదేశ పాలనకి ఈస్టిండియా కంపెనీ రూపం లోకి వచ్చిన తర్వాత మాత్రమే చరిత్ర విషయం లో చాలానే మేలు జరిగింది. కళింగ సీమకి మాత్రం పెద్ద ద్రోహం జరిగింది. మంచి ఉన్న దగ్గర మంచీ, చెడు ఉన్న దగ్గర చెడూ చెప్పడమే నిష్పక్ష పాత వ్రాతకి సాక్ష్యమవుతుంది. మెకంజీ కైఫీయతులూ,గెజిట్ లూ,అశోకుడి శాసనాలూ,ఇతర రాజుల దానశాసనాలూ,ప్రాచీననాణేలూ,పురాణ ఇతిహాసాలూ,బౌధ్ధుల పిటకలూ,జైనమత గ్రంధాలూ,విదేశీ యాత్రికుల కాలానుగత అనుభవాలూ,చరిత్రాత్మక పరిశోధనలూ,ఇతర ప్రాంతీయ దేశాల చరిత్ర ,మన జాతి చరిత్రను గుర్తించేందుకు,కాలానుగుణంగా ఏర్పరిచేందుకు కల్ప తరువులవుతాయి. మనవిశ్వవిద్యాలయాలు,ప్రాచీన నలందా,తక్షశిలల నుండి ఏది నేర్చుకున్నా నేర్చుకోక పోయినా,పరిశోధనలు (నేను చెప్పేది చరిత్ర గురించి మాత్రమే) కేవలం దాక్టరేట్ లు సంపాదించుకోవడానికనీ,ప్రొఫెసర్ లు గా ,మామూలు ప్రజలతో ఏ అవసరమూ లేని గొప్ప ప్రతిభావంతులుగా ముద్రలు వేయించుకోవడానికేననీ తాము తెలుసుకున్నది ఏదీ సామాన్యులకి చెప్పే అవసరం ఎంత మాత్రం లేదనీ త్రికరణ శుధ్ధిగా నమ్మిన వాళ్ళన్న నమ్మకాన్ని ఇంతవరకూ సడలి పో కుండా కాపాడుకున్నారు. మన దేశంలో ఉన్న మన తాతల కాలంనాటి తాటాకు పత్ర గ్రంధాలు రంగు వెలసి పోతూ,బూజు పట్టి పోతూ అన్ని రాష్ట్రా లలో,కొన్నైతే దేశ విదేశాల మ్యూజియం ల లో మగ్గిపోతూనే ఉంటాయి.కొందరు రాజులు సేకరించిన గ్రంధాలు వారి వారి లైబ్రరీ లలో నిద్రపోతూ ఉంటాయి.విశ్వ విద్యాలయాలలో ఆచార్యులు చరిత్రకు సంబంధించి చేసిన పరిశోధన, వారికి ఆచార్యత్వం తెచ్చి పెట్టిన పరిశోధనా పత్రాలు, గ్రంధాలు విద్యాలయాల మాళిగల్లో భద్రంగా కొలువు తీరే ఉంటాయి. మన తాతల కాలంనాటి చరిత్రోపాధ్యాయులు పాఠశాలల్లో బోధించే చరిత్ర పాఠ్య పుస్తకాలల్లోనిదే తప్ప అంతకుమించి ఒక్క అడుగు ఏనాడూ ముందుకు వెయ్యనే వెయ్యదు.

కళింగ సీమకి ఎంతద్రోహం జరిగిందో మునుముందు ఈ కళింగ కేకలో తెలుసు కుందాం !