కళింగ కేక

కళింగ కేక
నా కళింగ సీమ..ఖచిత నవరత్న లేమ.

3, ఆగస్టు 2020, సోమవారం



కళింగ సీమకి "వరాల వాన"
నా ఈ కళింగ కేక ఎవరికీ వినబడని రోదన గానే మిగిలిపోతున్నఈ కాలంలో, ఒక స్వల్పకాలిక ప్రయోజనమో, ఒక దీర్ఘకాలిక వికాసమార్గమో , ఈ సీమవాసులకి సిధ్దించేలా సంకల్పబధ్దుడై, నేటి ముఖ్యమంత్రివిశాఖ నగరాన్ని,తేజోభరితమైనదిగా తీర్చిదిద్దడానికి ముందుకు రావడం ,కళింగ సీమకి వరాల వాన కురవడమే కదా..!అందుకేనేను మళ్ళీ "మా కళింగ సీమ ఆన" వినిపిస్తున్నాను .
                    
మా కళింగ సీమ..ఆన.!

మా కళింగసీమ*దివ్యరోచులభామ..ఖచిత నవరత్న లేమ కదా..!

అయినా…! వేల వేల సంవత్సరాలుగా ..మాసీమ కెన్ని ప్రళయాలనీ..!!

మేం.. తరతరాలుగా ఎన్ని కన్నీటి కడవలని పగులగొట్టామనీ..!

మొన్నటికి మొన్న మామీద ఎగబడ్డ హుధూద్

తనని తాను ఒక హర్యక్షం అనుకుంది కాబోలు

నిన్నటినుంచీ కరోనా కూడా మాపట్ల దిగబడిన

జడల రక్కసినని పెంకెగా రంకెలేస్తోంది

ఈనాడు స్టెయిరిన్ అనే వెర్రిగాలికూడా

మామీదనే చిచ్చర పిడుగులా విరుచుకు పడింది కదా..!

ఇవన్నీ మమ్మల్ని భయపెట్టాలని

పర్జన్య గర్జన లెన్ని చేస్తున్నా

తురంగ పదాంగ చలనాలెన్ని చేసినా

కురంగ రంగేళీ విన్యాసాలెన్ని చూపినా..!

మా కళింగసీమ..దివ్యరోచులభామ..

ఖచిత నవరత్న లేమ కదా..!

ఇది అలనాడు..వాలి ఉయ్యాలలూపిన సీమ

కౌరవులు గుండెకత్తుకున్న భామ..పాండవులు నెత్తికెత్తుకున్న నేల

బలరాముడి నాగలినడయాడిన భూమి.. కదా..!

ఇంకా ఇది..అ.శోకుడి నేత్రాలని..నీటి నిలయాలుగా చేసిన నేలేకదా..!

ఈసీమ ఒకప్పుడు ఖారవేలుడు..కణం కణమూ వెలిగించిన జ్వాలగా

వెలిగి మెరిసిపోలేదా..?

ఇది తాండ్ర పాపారాయుడు తొడలు చరిచిన భూమే.. కదా!

ఇదిగో అందరూ నడవాల్సిన ఆదుగుజాడలివిగో..

ఇక్కడున్నాయని చెప్పిందిక్కడి గురజాడే కదా..!!

శంభో” అన్న తన కేకతో దేశ దేశాలనూ

అదరగొట్టిన అజ్జాడ ఇక్కడి వాడేకదా..!

ఇక్కడి నుంఛే కదా..! కలియుగభీముడు

 అమోఘ భుజబల తేజుడు  కోడి రామ్మూర్తినాయుడు

ప్రపంచానికే తన రొమ్ము చూపి, మీసం మెలి పెట్టేడు

తన సాటెవ్వరూ రాలేని మా మేటి బొమ్మల రేడు

వడ్డాది పాపయ్య గీసిన భామ కదా.. మా కళింగ సీమ

మణుగుబరువులిక్కడి మగువలెత్తగలరని

లోకానికి మా లెక్క చెప్పిన మల్లీశ్వరి ఇక్కడి

మాణిక్యమే కదా..! అందుకే కదా ..!

 ధైర్యం మాదగ్గరే  తన తలవొంచి నిలబడుతుంది

నిబ్బరమే ..మా వెన్ను నానుకుని తన దన్నుచూసుకుంటుంది.

ఇంతవరకూ ..మేం.. మందగమన మద మత్తేభం లాంటి

ఏరాడ కొండ మాకండగా వున్న వాళ్ళం కదా..!

ఇప్పుడయితే.. మీతో నేనున్నానంటూ

మా పక్కనే నిలబడిన ధీరోదాత్తుడు..

జ్వలిత జనవల్లభుడు..మడమ తిప్పని యోధుడు..

జగన్మోహనుడు..మా కిప్పుడు మరో ఖారవేలుడే.. కదా!

ఇది నిజం గా మాకు..నిలువెత్తు సంభ్రమమే…!

మాకు తన బలమైన భరోసాతో

చేయినందించి నిలబడమంటున్న.. జనవల్లభుడు..

జగన్మోహనుడికి ..అభివందనాలనందిస్తూ..

మిత్రులారా..! మీతో పాటు

మేమూ..నిలబడతాం.

అందరూ నచ్చే,మెచ్చే శిల్పంలాగా.నవ్వే.. తుళ్ళే పాపాయిలాగా

కురిసే..మెరిసే మేఘం లాగా,మళ్ళీ  మా విశాఖను,

మాకళింగసీమను..మీకు కనబరుస్తాం

ఇది మా కళింగ సీమ ..ఆన.

           ********

                "అమరావతి- అసలు కథ "   ( తరువాత పోష్టు నుండి ప్రారంభమవుతుందని వీక్షకులందరికీ వినయంగా తెలియజేస్తున్నాను)   

                                                                                                                                       "వేదప్రభాస్"